Sunday, August 19, 2012

జమ్మూ కాశ్మీర్ పై మధ్యవర్తుల నివేదిక ప్రగతి శీలమా? ప్రమాదకరమా?


వేదికపై ప్రసంగిస్తున్న డా. జితేంద్ర సింగ్
జూలై 1వ తేదీన బాగ్ లింగంపల్లిలోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో సోషల్ కాజ్ మరియు జమ్మూ కాశ్మీర్ అధ్యయన కేంద్రం సంయుక్తంగా జమ్మూ కాశ్మీర్ పై మధ్యవర్తుల నివేదిక ప్రగతిశీలమా? ప్రమాదకరమా? అనే అంశంపై జరిగిన సంగోష్టి కార్యక్రమంలో శ్రీ జితేందర్ సింగ్ (బిజెపి చీఫ్ స్పోక్స్ పర్సన్), శ్రీ మాడభూషి శ్రీధర్ (నల్సార్ యూనివర్సిటీ ప్రొఫెసర్), శ్రీ రాహుల్ (కాశ్మీర్ పండిట్) ప్రసంగించారు. శ్రీ రాకా సుధాకర్ కార్యక్రమం నిర్వహించారు. శ్రీమతి సోమరాజు సుశీల గారు (సోషల్ కాజ్) వందన సమర్పణ చేశారు. 

కార్యక్రమంలో శ్రీ మాడభూషి శ్రీధర్ మాట్లాడుతూ "ఇంటర్ లాక్యుటర్స్ అనే పదమే చాలా విచిత్రంగా ఉంది. సమస్యను పరిష్కరించాలని లేనప్పుడు ప్రభుత్వాలు చేసే పని ఒక కమిటీ వేసి అధ్యయనం చేయించటం. కమిటీ నివేదికలో అందరూ బాగుండాలి అని చెప్పింది. అందరూ బాగుండాలంటే సాధ్యాసాధ్యాలు చర్చించాలి. ఈ కమిటీ అట్లా చర్చించకుండా ఇంకొక కమిటీ వేసేందుకు వీలుగా రిపోర్ట్ తయారు చేసింది. ఈ నివేదిక తాజా అభిప్రాయం కాదని ప్రభుత్వ గృహమంత్రిత్వ శాఖ ప్రకటించింది. ఆ నివేదికలో కాశ్మీర్ కు ప్రత్యేకంగా కేటాయించిన 370 ఆర్టికల్ ప్రత్యేక ప్రతిపత్తిని కాపాడటంలో కేంద్రం, వివిధ పార్టీలు విఫలమైనాయనే అభిప్రాయం కనబడుతోంది. తాత్కాలికం అని చెప్పబడిన 370 ఆర్టికల్ ను శాశ్వతం చేయాలని సూచించారు. దీనిలోనే అసలు సమస్య ఉన్నది. ఈ నివేదిక ఎటువంటి ముగింపును ఇవ్వలేదు. ముగింపు ఇవ్వకపోవటమే ముగింపు అని చెప్పింది. ఇంతకాలం అధ్యయనం చేసిన కమిటీ చివరకు చెప్పింది ఇదీ. రాహుల్ మాట్లాడుతూ "కాశ్మీర్ సమస్య గురించి ఎవరు ఎప్పుడు ఎక్కడ  మాట్లాడినా కాశ్మీర్ లోయ గురించి, కాశ్మీర్ ముస్లింల గురించి మాట్లాడతారు కాని, కాశ్మీర్ పండిట్స్ గురించి మాట్లాడరు. ఈ కమిటీ కూడా కాశ్మీరీ పండిట్స్ అభిప్రాయం తీసుకోవటం కాని, నివేదికలో వారి సమస్యల పరిష్కారం గురించి పేర్కొనటం కాని చేయలేదు. 1989 - 90 సంవత్సరాలలో కాశ్మీర్ లోయ నుండి కాశ్మీరీ పండిట్స్ బయటకు వచ్చేశారు. వాళ్ళందరూ దేశంలో అనేక చోట్ల, విదేశాలలో కూడా ఉన్నారు. వారి సమస్యకు పరిష్కారం ఎప్పటికి దొరుకుతుందో? 


ప్రధాన వక్త శ్రీ జితేందర్ సింగ్ మాట్లాడుతూ ... 

కాశ్మీర్ సమస్య పూర్వాపరాలు ఆలోచిస్తే అందులో రాజకీయ సమస్యలు చాల ఉన్నాయి. వ్యక్తిగత ఇష్టాఇష్టాలు ఉన్నాయి. వీటన్నింటికంటే కీలకమైనది పాకిస్తాన్ ఆక్రమణలో ఉన్న కాశ్మీర్ భూభాగాన్ని విముక్తం చేయటం. అదే కాశ్మీర్ సమస్యకు పరిష్కారమని 1994 సంవత్సరంలో కాంగ్రెస్  ప్రభుత్వం ఏకగ్రీవ తీర్మానం చేసింది. అది పార్లమెంట్ మినిట్స్ లో కూడా ఉంది. అంటే అది ప్రభుత్వ విధాన నిర్ణయం. మధ్యవర్తిత్వ కమిటీ (ఇంటర్ లాక్యుటర్స్) నివేదికలో దానికి విరుద్ధంగా ఉండటం దురదృష్టకరం. అసలు మన ప్రభుత్వాలు ఏ సమస్యనూ పూర్తిగా పరిష్కరించక పోవటమే విధానంగా కనబడుతున్నది. చాలా సంవత్సరాలకు పూర్వం అమెరికా ప్రెసిడెంట్ లిండన్ జాన్సన్ ను పత్రికా విలేఖరుల సమావేశంలో ఒక భారతీయ రిపోర్టర్ శ్రీ ఇంద్రజిత్ "టెక్సాస్ సమస్య మళ్ళీ తలెత్తుతుందా?" అని అడిగాడు. లిండన్ జాన్సన్ దానికి సమాధానంగా ఆ అధ్యాయం ముగిసి పోయిందని చెప్పారు. భారత దేశంలో ఏ అధ్యాయానికీ ముగింపు లేదు. అధ్యాయాలను తిరగదోడుతూ ఉంటారు. 


దేశానికి స్వతంత్రం వచ్చినప్పుడు భారత దేశం రెండు భాగాలుగా ఉండేది. 1) బ్రిటీష్ వాళ్ళు నేరుగా పాలించిన భూభాగాలు, 2) బ్రిటీష్ వాళ్లకు సామంతులుగా ఉన్న సంస్థానాలు. బ్రిటీష్ వారు పాలించే భూభాగం స్వతంత్రమయ్యింది. సంస్థానాలకూ స్వతంత్రం వచ్చింది. సంస్థానాలు అటు పాకిస్తాన్లో, ఇటు భారత్ లో ఎక్కడైనా విలీనం కావచ్చు. ఆ సమయంలో 560 సంస్థానాలను పటేల్ భారత్ లో విలీనం చేశారు. కాశ్మీర్ విలీనం మాత్రం నెహ్రూ తన చేతుల్లోకి తీసుకొన్నారు. ఈ సమయంలో కాశ్మీర్ కు సంబంధించి
నెహ్రూ మూడు తప్పిదాలు చేశారు. 1) షేక్ అబ్దుల్లాకు మద్దతుగా కాశ్మీర్ రాజుపై వత్తిడి తెచ్చిన కారణంగా జమ్మూ కాశ్మీర్ విలీనం కొంత ఆలస్యమైంది. 2) పాకిస్తాన్ కాశ్మీర్ ను ఆక్రమించేందుకు చేస్తున్న ప్రయత్నాన్ని మన సైన్యం తిప్పికొడుతున్న సమయంలో ఈ సమస్యను ఐక్యరాజ్య సమితి (UNO) కి తీసుకొని వెళ్ళారు. 3) కాశ్మీర్ కు తాత్కాలికం అని పేర్కొన్న ప్రత్యేక ప్రతిపత్తిగా 370 అధికరణం ఏర్పాటు చేశారు. 370 అధికరణం కాశ్మీర్ లోని ముస్లింలకు కూడా సమస్యాత్మకమయింది. దీనిపై చర్చ జరగాలి. తాత్కాలికం అని పేర్కొనబడ్డ 370 అధికరణం ఇంకా కొనసాగుతూనే ఉంది. దీనిపైన బహిరంగ చర్చకు ఆహ్వానించినా ప్రభుత్వం స్పందించడం లేదు. సమస్యను ఎప్పటికప్పుడు పొడిగిస్తూనే ఉన్నారు. ప్రత్యేక ప్రతిపత్తి అనటంలో కొందరికి కొన్ని రకాల మోహాలు దానిపై ఏర్పడ్డాయి. దానిని ఆసరా చేసుకొని రాజకీయాలు చేస్తున్నారు. మధ్యవర్తిత్వ కమిటీ నివేదికలో ఆరు రకాల తప్పుడు సంకేతాలు కనబడతాయి.

1) రాజ్యాంగ కమిటీ ద్వారా 1953 కి ముందు, తరువాత కాశ్మీర్ కు వర్తింపచేసిన కేంద్ర ప్రభుత్వ చట్టాలను పునః సమీక్ష చేయాలని సూచించింది. అంటే పాత విధానాలను తిరిగి తోడాలనేది దాని సారాంశము. అంటే ఒకే దేశంలో ఇద్దరు ప్రధానులు ఇద్దరు రాష్ట్రపతులు, రెండు విధానాలు ఉండటం గతం. ఆ విధానానికి వ్యతిరేకంగా శ్యాం ప్రసాద్ ముఖర్జీ గళం ఎత్తారు. చివరకు బలిదానమైనారు. వాటిని ప్రభుత్వం ఎత్తకెఅలకు రద్దు చేసింది. వాటిని పునరుద్ధరించాలనేది ఆ కమిటీ సూచన. 


2) రాజ్యాంగము 370 అధికర
ణాన్ని తాత్కాలికం అని పేర్కొన్నారు. ఆ అధికరణంలోని తాత్కాలికం అనే పదాన్ని తొలగించాలని సూచించారు. అంటే ఆ అధికరణం శాశ్వతం కావాలనేది వాళ్ళ సూచన.

3) కాశ్మీర్ భారత్ లో అంతర్భాగము, అందులో కొంత భాగం పాకిస్తాన్ ఆక్రమణలో ఉంది, అందుకే దానిని పి.ఓ.కే. అంటాము. ఈ నివేదికలో "పాకిస్తాన్ అధీనంలో ఉన్న కాశ్మీర్" అనే పదజాలం ఉపయోగించింది. ఇటువంటి విషయాలు కాశ్మీర్ లోయలోని వేర్పాటు వాదులు మాట్లాడుతూ ఉంటారు. ఆ విషయాలను ఈ నివేదికలో పేర్కొనటం దురదృష్టకరం. 


4) కాశ్మీర్ సమస్య అంటే కేవలం కాశ్మీర్ లోయలోని ముస్లింల సమస్య అనే అభిప్రాయం వ్యక్తమయింది. హురియత్ వాళ్ళతో చర్చలు జరపాలని కూడా సూచించారు. కాశ్మీర్ నుండి గేన్తివేయబడిన హిందువుల గురించి గాని, హిందూ ప్రతినిధులను కలవటం గాని చేయలేదు. ఇది తీవ్ర అభ్యంతరకరమైనది. కాశ్మీర్ పండిట్ లు లేని కాష్మీరియాట్ అనే దానికి అర్థం ఉందా?


5) కాశ్మీరు గవర్నరును నియమించాలంటే కాశ్మీర్ ప్రభుత్వం భారత ప్రభుత్వానికి మూడు పేర్లు సూచించాలి. దానిలో ఒక పేరు ఎన్నుకొంటారు. గవర్నర్, ముఖ్యమంత్రి వంటి పదాల విషయంలో ఉర్దూ పదాలు వాడాలని సూచించారు. ఇది భారత్ ఫెడరల్ రాజ్యాంగాన్ని నీరుగార్చేది.


6) గడిచిన 20 సంవత్సరాల నుండి కాశ్మీర్ లోను, దేశంలోను పాక్ ప్రేరిత ఉగ్రవాదం చాలా తీవ్రమైన సమస్యగా ఉన్నది. ఈ సమస్య గురించి ఆ కమిటీ ఎక్కడా ప్రస్తావించలేదు.


దేశ విభజన సమయంలో, కాశ్మీర్ ను పాకిస్తాన్ ఆక్రమించుకొన్న సమయంలో రక్షణ కోసం అక్కడ నుండి కాశ్మీర్ చేరిన హిందువులు రెండు లక్షలకు పైగా ఉంటారు. వారికి ఈ రోజుకీ అసెంబ్లీ ఎన్నికలలో ఓటు వేసే హక్కు లేదు. 


మధ్యవర్తుల కమిటీ సూచించిన ఇటువంటి వివాదాస్పద విషయాలు కాశ్మీర్ సమస్యకు పరిష్కారం సూచించలేవు. దాని కోసం మరో కమిటీ వేయవలసిన పరిస్థితి నెలకొంది. ఇదే ముగింపుగా కమిటీ సూచించినట్లయింది. 


http://www.lokahitham.net/2012/02/blog-post_1.html

No comments:

Post a Comment